వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపు వ్యవహారంలో వివాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బ్యాలెట్ బాక్సును బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలతో నల్లపాడు పోలీసులు అప్పిరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా లేళ్ల అప్పిరెడ్డిని మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని పేర్కొంటూ నల్లపాడు పోలీసులు గుంటూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల విజ్ఞప్తికి ఆమోదం తెలుపుతూ 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో నల్లపాడు పోలీసులు ఆయన్ను జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

మరోవైపు, ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అప్పిరెడ్డి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్‌పై నవంబర్ 25న తుది నిర్ణయం వెలువరించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.