పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురంలో ఈరోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల తుది రోజున వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి వర్గాల కాన్వాయ్‌లు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామంపై ఇరు పార్టీల నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.

ఈ క్రమంలో మీడియాతో బీటెక్ రవి మాట్లాడుతూ... అవినాశ్ రెడ్డి కావాలనే ఉద్రిక్తతలు సృష్టించి ఆ నెపాన్ని తమపై నెడుతున్నారని ఆరోపించారు. సింహాద్రిపురం ఘటనపై వైసీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా అర్బన్ ఓటరైన అవినాశ్ 30 నుంచి 50 వాహనాలతో సింహాద్రిపురం రావాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. గతంలో మున్సిపాలిటీలో జరిగిన ఘటనలతో పాటు, నేటి పరిణామాలపై అవినాశ్ రెడ్డి, దుశ్యంత్ రెడ్డిల పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.