తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో పాఠశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఈవ్‌టీజింగ్ సమస్యపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఆడపిల్లలను వేధింపులకు గురిచేస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రైల్వేకోడూరులోని ఓ పాఠశాల వద్ద బాలికలు ఈవ్‌టీజింగ్‌కు గురవుతున్నారంటూ ఒక టీవీ ఛానల్‌లో ప్రసారమైన కథనంపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "రైల్వేకోడూరులో పాఠశాల వెలుపల నా చిట్టి చెల్లెళ్లు ఈవ్‌టీజింగ్ ఎదుర్కొంటున్నారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది. ఏ విద్యార్థిని కూడా భయంతో తరగతి గదికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఈ అంశంపై తిరుపతి కలెక్టర్, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని, మన విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలి" అని ఆయన కోరారు.

మంత్రి ఆదేశాలతో తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణమే అప్రమత్తమైంది. రైల్వేకోడూరు పోలీసులు నేరుగా సంబంధిత పాఠశాలకు చేరుకున్నారు. స్థానిక సీఐ స్వయంగా విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పోలీసు శాఖ అండగా ఉంటుందని బాలికలకు భరోసా కల్పించారు.

మహిళలు, విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని వెంటనే గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు.