ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడంలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘టాప్ సీక్రెట్’ వ్యూహాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అదే రోజున సమాధానం ఇవ్వడమే తమ రహస్యమని, ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా నిరభ్యంతరంగా అనుసరించవచ్చని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా లోకేశ్ ఒక పోస్ట్ చేశారు. "బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ టాప్-సీక్రెట్ పెట్టుబడి వ్యూహం లీక్ అయింది. దాని పేరు ‘పెట్టుబడిదారులకు అదే రోజు సమాధానం ఇవ్వడం’. దీన్ని కాపీ చేసుకోవడానికి సంకోచించకండి" అని పేర్కొంటూ, ఆ పోస్ట్‌కు #SpeedOfDoingBusiness అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయంటూ పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో లోకేశ్ ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్టుబడులను ఆకర్షించడంలో తమ ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందో తెలియజేసేందుకే ఆయన ఈ చమత్కార వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, నిర్ణయాల తీసుకోవడంలో జాప్యం లేకుండా చూడటం, పారిశ్రామికవేత్తలతో నేరుగా సంప్రదింపులు జరపడం తమ ప్రభుత్వ ప్రాధాన్యమని లోకేశ్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్లస్టర్ల ఆధారిత వ్యూహాన్ని అనుసరిస్తూ, అంగీకారం కుదిరిన ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ పోస్ట్ ద్వారా ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.