పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్‌లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ జరగనున్న దృష్ట్యా, కూటమికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా ఆదివారం సాయంత్రానికే న్యూఢిల్లీకి చేరుకోవాలని స్పష్టం చేశారు. ఈ చారిత్రక బిల్లులపై చర్చ, ఆమోదం జరిగే సమయంలో కూటమి ఎంపీలు ఒక్కరు కూడా గైర్హాజరు కాకూడదని తేల్చిచెప్పారు.

ఆదివారం నాడు టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వేదికగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రక పరిణామంలో భాగస్వాములు కావడం ప్రజాప్రతినిధులకు దక్కిన గొప్ప అవకాశమని అన్నారు. ఈ ప్రక్రియలో ఎన్డీయే కూటమి ఎంపీలంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు 50 శాతం మేర సీట్లు పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు. దీనివల్ల ఏ ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదని, నష్టం వాటిల్లదని ఆయన భరోసా ఇచ్చారు. గతంలో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశంలో రాజకీయ పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని, గతంలో ఈ బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు సైతం నేడు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు.

అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో చిత్తశుద్ధి, సంకల్పంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకెళుతున్నారని చంద్రబాబు కొనియాడారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చడం ద్వారా మహిళా సాధికారత మరింత బలోపేతం అవుతుందని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగి చరిత్రలో నూతన అధ్యాయం మొదలవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా ప్రతినిధులు కూడా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్డీయే నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు, ప్రధాని మోదీ ఆలోచనలకు ఎంపీలంతా సంపూర్ణ మద్దతుగా నిలవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.