సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ రాయపాటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రాయపాటి సాంబశివరావు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజాసేవను గుర్తుచేసుకున్నారు. "సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గారి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు సేవలందించిన ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నాను. సుదీర్ఘ ప్రజాసేవతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాయపాటి గారికి నా నివాళి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేశ్ కూడా రాయపాటి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆరుసార్లు ఎంపీగా పనిచేసి ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి రాయపాటి సాంబశివరావు గారు. వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం" అని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు తనదైన చెరగని ముద్ర వేశారు. ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండేవారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పలువురు నేతలు పేర్కొంటున్నారు. రాయపాటి మృతితో ఆయన స్వస్థలంలోను, రాజకీయ వర్గాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.