మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30న ప్రారంభం కానున్న లోక్‌సభ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. "మహిళా సాధికారత కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకూడదు. రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి" అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానుండటం శుభపరిణామమని అనిత పేర్కొన్నారు. "దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములుగా మాత్రమే కాకుండా నిర్ణయాధికారులుగా ఎదగాలి. మహిళలు మార్పులో భాగం కావాలి.. మార్పుకు మార్గదర్శకులు కావాలి" అని ఆమె ఆకాంక్షించారు. చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టమవుతుందని, కేంద్రం తీసుకుంటున్న ఈ చారిత్రక నిర్ణయం దేశవ్యాప్తంగా మహిళల్లో సరికొత్త విశ్వాసాన్ని నింపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.