కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను వ్యతిరేకించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తిని డీఎంకే అధినేత స్టాలిన్ తిరస్కరించారు. కేంద్రం తీసుకువస్తున్న రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్ (రెండవ) బిల్లు-2026లకు మద్దతు ప్రకటిస్తూ తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులపై డీఎంకే వైఖరిని మార్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర 'ఇండియా' కూటమి నేతల ప్రతినిధి బృందం ఆదివారం చెన్నైకి చేరుకుంది. అయితే, అంతకుముందే 'ఎక్స్' వేదికగా రాహుల్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన స్టాలిన్... తమిళనాడు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకే తమ మొదటి ప్రాధాన్యమని, ఈ మార్గంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

1971 జనాభా లెక్కల ఆధారంగా అన్ని రాష్ట్రాలకూ సమాన నిష్పత్తిలో 50 శాతం లోక్‌సభ స్థానాల పెంపును బిల్లులో పొందుపరిచారని, ఇది తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల విజయమని డీఎంకే పేర్కొంది. మరోవైపు, లోక్‌సభ స్థానాలను 850కి పెంచడం ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీస్తుందని, అధికార బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

చెన్నై పర్యటన ముగిసిన అనంతరం ఈ కాంగ్రెస్ ప్రతినిధి బృందం ముంబై వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కూడా చర్చలు జరపనుంది. కీలక బిల్లుల ప్రవేశానికి ముందు 'ఇండియా' కూటమిలో భిన్న వైఖరులు బయటపడటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.