విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి ఘాట్ రోడ్డులో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బస్సులోని విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయుడికి స్వల్ప గాయాలయ్యాయని నారా లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం వారికి విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను సుదూర ప్రాంతాలకు, విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లే సమయంలో పాఠశాల యాజమాన్యాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ప్రయాణాలకు ఉపయోగించే వాహనాల ఫిట్‌నెస్‌ను ముందస్తుగా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుభవం, నైపుణ్యం కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని స్పష్టం చేశారు. పిల్లల భద్రతకు సంబంధించి అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పాఠశాల యాజమాన్యాలను ఆదేశించారు.

కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్ర నిమిత్తం శనివారం విశాఖపట్నం వచ్చారు. కైలాసగిరిని సందర్శించిన అనంతరం, మధ్యాహ్నం సమయంలో కొండపై నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో బస్సు కిందకు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక మలుపు వద్దకు రాగానే బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నారు. ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో పిల్లలు భయంతో కేకలు వేశారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, 108 అంబులెన్స్ సహాయంతో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.