కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై దేశ రాజకీయాల్లో విస్తృత చర్చ మొదలైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న ఈ బిల్లుతో దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని మల్లు రవి ప్రశ్నించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ బిల్లుకు డీఎంకే అధినేత స్టాలిన్ మద్దతు ప్రకటించడంపై మల్లు రవి విమర్శలు గుప్పించారు. బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించడమే డీఎంకే సిద్ధాంతమని అన్నారు. సామాజిక అసమానతలు, కుల వివక్షకు వ్యతిరేకంగా పెరియార్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని చెప్పారు. అలాంటిది, ఈ బిల్లుకు స్టాలిన్ మద్దతు పలకడం ఆక్షేపణీయం అని తెలిపారు.

ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం పెంచే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీనివల్ల లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 850కి చేరే అవకాశం ఉంది. 33 శాతం మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నాటికి అమలు చేయడానికి డీలిమిటేషన్ ప్రక్రియ అవసరమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.