మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.

రాయపాటి సాంబశివరావు గతంలో ప్రోస్టేట్ క్యాన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకున్నారు. అయితే ఇటీవల ఆయనకు మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు నవంబర్ 23న ఆయన్ను గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషించారు. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండేవారు. రాజకీయ రంగంలోనే కాకుండా విద్యా, వ్యాపార రంగాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. విద్యాసంస్థలను నెలకొల్పి ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో విశేష సేవలందించారు.

రాయపాటి సాంబశివరావు 1943లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఉంగుటూరులో జన్మించారు. 1972లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ ఎంపీగా వ్యవహరించారు. 39 ఏళ్ల వయసులోనే ఆయన పెద్దల సభలో అడుగుపెట్టడం విశేషం. 

రాయపాటి 1996, 1998, 2004, 2009, 2014లో లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. ఆయన 1982 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. చివరిగా 2014 లోక్ సభ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

రాయపాటి సాంబశివరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.