వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర భవిష్యత్ తాగునీటి అవసరాలను తీర్చేందుకు జలమండలి ఒక కీలకమైన, దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యంగా పశ్చిమ, నైరుతి ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉస్మాన్‌సాగర్‌ జలాశయం నుంచి అదనంగా రోజుకు 21 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) నీటిని తరలించాలని నిర్ణయించింది. 

ఈ నీటిని శుద్ధి చేసేందుకు షేక్‌పేట ఫిల్టర్‌ బెడ్స్ వద్ద అత్యాధునిక నీటి శుద్ధి కేంద్రాన్ని (డ‌బ్ల్యూటీపీ) నిర్మించనుంది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌ నుంచి జలమండలి రోజుకు 20 నుంచి 25 ఎంజీడీల నీటిని వినియోగిస్తుండగా, ఈ కొత్త ప్రాజెక్టు పూర్తయితే నగరానికి అదనంగా మరో 21 ఎంజీడీల శుద్ధి చేసిన నీరు అందుబాటులోకి రానుంది.

ఈ బృహత్ ప్రణాళికలో భాగంగా నీటిని శుద్ధి కేంద్రానికి, అక్కడి నుంచి వినియోగదారులకు చేరవేసేందుకు భారీ పైప్‌లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. పుప్పాలగూడ బీఆర్‌సీ నుంచి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంజీఐటీ) వరకు ప్రతిపాదించిన 120 అడుగుల రహదారి వెంబడి ఈ పైపులైన్లను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఒకటి 1200 మిల్లీమీటర్లు, మరొకటి 1300 మిల్లీమీటర్ల వ్యాసంతో దాదాపు 10 కిలోమీటర్ల పొడవున ఈ పైపులైన్లు ఉండనున్నాయి.

క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన.. సమన్వయంతో పనులు
ప్రాజెక్టు అమలులో సమన్వయం అత్యంత కీలకమని భావించిన ఉన్నతాధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. జలమండలి ఎండీ కె. అశోక్‌ రెడ్డి, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఎండీ ఉపేందర్‌ రెడ్డి కలిసి ప్రతిపాదిత మార్గాన్ని పరిశీలించారు. 

రహదారి విస్తరణ పనులు, తాగునీటి పైపులైన్ల నిర్మాణం ఏకకాలంలో జరిగేలా చూడాలని, తద్వారా పదేపదే రోడ్లు తవ్వే పరిస్థితికి ముగింపు పలకాలని వారు అభిప్రాయపడ్డారు. ఒకే పని కోసం వేర్వేరు సంస్థలు పలుమార్లు రోడ్లను తవ్వడం వల్ల ప్రజాధనం వృధా కావడమే కాకుండా, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, ఈ సమస్యను అధిగమించడమే తమ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.

పర్యటన సందర్భంగా పైపులైన్ల ఏర్పాటుకు ఉన్న సాంకేతిక సవాళ్లు, భూసేకరణ అవసరాలు, భూగర్భంలో ఉన్న ఇతర యుటిలిటీస్ (విద్యుత్ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు) వంటి అంశాలపై అధికారులు చర్చించారు. వీలైనంత వరకు రహదారులను కొత్తగా తవ్వకుండా, ఇప్పటికే ఉన్న కండ్యూట్లు, బండ్‌ల వెంబడి పైప్‌లైన్లు వేసే అవకాశాలను పరిశీలించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో భవిష్యత్తులో పెరిగే జనాభా, వాణిజ్య సముదాయాల నీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా, నగర నీటి సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక, డిజైన్లను త్వరలోనే ఖరారు చేయనున్నారు.