ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తో పాటు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ మహిళా సాధికారత దిశగా పడబోతున్న ఒక నిర్ణయాత్మక అడుగు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రెండు కీలక బిల్లులను అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయకుండా, రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లులకు మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ బిల్లులను వ్యతిరేకించడం అంటే మహిళలకు దక్కాల్సిన న్యాయాన్ని నిరాకరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అంశంలో ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. 1986లోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 60 శాతం సీట్లు మహిళలకే దక్కాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అధికారిక తీర్మానాన్ని పంపిందని వివరించారు.

నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు కీలక విశ్లేషణ చేశారు. దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ప్రతి రాష్ట్రం వాటా సురక్షితంగా ఉంటుందని, తద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చెక్కుచెదరకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పెంపు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 25 నుంచి 38కి పెరుగుతుందని ఆయన వెల్లడించారు.

జనాభా ప్రాతినిధ్యంపై గణాంకాలను వివరిస్తూ.. 1971లో ఒక పార్లమెంట్ సభ్యుడు సగటున 10 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారని, నేడు ఆ సంఖ్య దాదాపు 27 లక్షలకు చేరిందని సీఎం తెలిపారు. డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరిగితే ఈ నిష్పత్తి సుమారు 18 లక్షలకు తగ్గుతుందని, ఫలితంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.