ప్రతిపాదిత 132వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ (రెండో) బిల్లు-2026లను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ప్రక్రియను తక్షణమే వాయిదా వేయాలని మాజీ సివిల్ సర్వెంట్లు, విద్యావేత్తలు, రాజ్యాంగ నిపుణులు కేంద్రాన్ని కోరారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఇంతటి కీలక బిల్లులపై సమగ్ర అధ్యయనం కోసం కనీసం 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ కన్సల్టేషన్) చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు వారు అధికారికంగా లేఖ రాశారు.

మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్, ఆర్థికవేత్త జయతి ఘోష్ సహా పలువురు ప్రముఖులు ఈ వినతిపత్రంపై సంతకాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2014లో తెచ్చిన 'ప్రీ-లెజిస్లేటివ్ కన్సల్టేషన్ పాలసీ' నిబంధనల ప్రకారం కీలక బిల్లులను చట్టసభల్లో పెట్టేముందు 30 రోజుల పాటు ప్రజల ముందు ఉంచాల్సి ఉందని వారు గుర్తు చేశారు. అయితే, నవంబర్ 27 రాత్రి మాత్రమే బిల్లుల వివరాలను బహిర్గతం చేసి, నవంబర్ 30న ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో వెంటనే చర్చకు తీసుకురావాలని చూడటం సమంజసం కాదని పేర్కొన్నారు.

డీలిమిటేషన్ కమిషన్ స్వతంత్రత, నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనలో పారదర్శకత, కమిషన్ ఛైర్‌పర్సన్ నియామకంపై కేంద్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉండటం వంటి అంశాలపై సంతకందారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లుల ద్వారా దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను సమానంగా 50 శాతం పెంచడంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. 

ఈ బిల్లులపై రాజకీయంగా ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమి వీటిని వ్యతిరేకిస్తుండగా, ప్రాంతీయ పార్టీల వైఖరిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలని మేధావులు స్పష్టం చేశారు.