మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు దేశ జనాభా పెరుగుదలకు అనుగుణంగా పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.

సుమారు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించాలనే నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన అభివర్ణించారు. విద్య, ఉద్యోగం, ఆర్థిక రంగాల్లో మహిళలు ఇప్పటికే తమ ప్రతిభను చాటుకుంటున్నారని, రాజకీయాల్లోనూ వారికి తగిన ప్రాధాన్యం దక్కాల్సిన సమయం వచ్చిందని వివరించారు. మహిళా సాధికారతకు సామాజిక, ఆర్థిక భాగస్వామ్యంతో పాటు రాజకీయ భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని తెలిపారు.

దేశంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని, అప్పట్లో దేశ జనాభా 58.8 కోట్లుగా ఉన్నప్పుడు లోక్‌సభలో 543 స్థానాలు ఉండేవని చెప్పారు. ప్రస్తుతం దేశ జనాభా దాదాపు 147 కోట్లకు చేరుకున్న తరుణంలోనూ అదే సంఖ్య కొనసాగడం సమంజసం కాదన్నారు. 

1971లో ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తే, ప్రస్తుతం సగటున 27 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోందని వివరించారు. నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం ద్వారా ప్రతి 18 లక్షల మందికి ఒక ఎంపీ ఉండేలా మార్పు తీసుకురావచ్చని, తద్వారా ప్రజల సమస్యలను చట్టసభల్లో సమర్థంగా వినిపించే అవకాశం దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలపై చంద్రబాబు స్పందించారు. గతంలో జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కేవలం 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన చేపడితే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యంలో నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న స్థానాలపై ఏకరూపంగా 50 శాతం సీట్లు పెంచే విధానం అత్యంత సరైనదని ప్రతిపాదించారు.

ఈ విధానం అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలు ప్రస్తుతమున్న 25 నుంచి 38కి పెరుగుతాయని సీఎం వివరించారు. అలాగే తమిళనాడులో 59, కర్ణాటకలో 42, తెలంగాణలో 26, కేరళలో 30 స్థానాలకు పెరుగుతాయని, వెరసి దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం పార్లమెంటు స్థానాల సంఖ్య 195కు చేరుతుందని విశ్లేషించారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా సమాఖ్య సమతుల్యత కాపాడబడుతుందని తెలిపారు. 2029 సాధారణ ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కావాల్సి ఉందని, అప్పుడే మహిళా రిజర్వేషన్ల సమర్థ అమలుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు హయాంలోనే మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ ప్రాతినిధ్యానికి పునాది వేశారని చంద్రబాబు గుర్తుచేశారు. అనంతరం డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు కృషి జరిగిందని, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక మేయర్ స్థానాలను మహిళలే దక్కించుకోవడం వారి ఎదుగుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని తెలిపారు.

ఈ నెలాఖరులో జరిగే పార్లమెంటు సమావేశాల్లో సభ్యులందరూ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గతంలో చోటుచేసుకున్న రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, దేశ ప్రయోజనాలు, మహిళల భవిష్యత్తు దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఈ కీలక బిల్లులకు ఏకగ్రీవంగా మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు దోహదపడే బిల్లులను వ్యతిరేకించే రాజకీయ పార్టీలను దేశంలోని మహిళలు తిరస్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు.