తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త చెబుతూ త్వరలోనే మరో 25వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అచ్చంపేట బిడ్డగా ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 75వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, రాబోయే రోజుల్లో మరో 25వేల కొలువులను భర్తీ చేస్తామని వెల్లడించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో చేసిన తప్పులకు ప్రజలకు ముఖం చూపించలేకే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రాన్ని రూ.8.50 లక్షల కోట్ల అప్పులపాలు చేసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజార్చారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటంతో ఏ మహిళా కట్టుకోలేదని, కేవలం చేల చుట్టూ కంచెగా కట్టుకోవడానికే పనికొచ్చాయని ఎద్దేవా చేశారు. సూరత్ నుంచి కేజీల లెక్కన నాసిరకం చీరలు తెచ్చి కమిషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు.

తమ పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామని సీఎం స్పష్టం చేశారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, ఈ మూడేళ్లలోనే రైతుల కోసం రూ.1.78 లక్షల కోట్లు వెచ్చించామని వివరించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లపాటు పడావు పెట్టి, కృష్ణా జలాలను నాటి ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్ రాసిచ్చారని ఆరోపించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే నేడు కృష్ణా జలాలు ఏపీకి తరలిపోతున్నాయని, పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లందిస్తానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.