కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఇండియా కూటమి తన వ్యతిరేకతను బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ ఆయన మరో ముగ్గురు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాలకు పదును పెట్టనున్నారు.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో కర్ణాటక, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ఉమ్మడి మీడియా సమావేశంలో పాల్గొంటారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల జరగబోయే నష్టాలను, దాని వెనుక ఉన్న రాజకీయ కోణాలను ప్రజలకు వివరించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఈ నలుగురు సీఎంలకు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో, ఎంపీలందరూ ఉదయం 10 గంటలకల్లా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి.

ఇదే అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో అధికార పార్టీ తమకు అనుకూలంగా రాజకీయ పటాన్ని మార్చుకోవాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని, అణగారిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. కేంద్రం ఏ ప్రాతిపదికన సరిహద్దులు మారుస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.