గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించిందని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బుధవారం భద్రాచలంలో పర్యటించిన ఆయన, అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరం వెంబడి చేపట్టిన పనులతో పాటు, ఆలయాల పునరుద్ధరణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు.

ఈ పర్యటనలో భాగంగా రంగనాయకుల గుట్ట సమీపంలో రూ.5.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మంచినీటి రిజర్వాయర్, పైప్‌లైన్లు, పంపింగ్ వ్యవస్థ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే, స్నానఘట్టాల వద్ద మరుగుదొడ్ల నిర్మాణం, కొత్త మార్కెట్ ప్రాంతంలో రూ. కోటితో చేపట్టనున్న గิరిజన బహుళార్ధసాధక (మల్టీపర్పస్) మార్కెట్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి, ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.300 కోట్లు కేటాయించినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. డిసెంబర్ 19న జరిగే తెప్పోత్సవం, 20న నిర్వహించే ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.