ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల విషయంలో వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. అధిక మోతాదులో కొవ్వు, చక్కెర లేదా ఉప్పు ఉన్న ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా హెచ్చరికలు ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ జె.బి. పార్థివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి ప్యాకెట్ ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా ఎర్రటి షడ్భుజి (Red Hexagon) ఆకారంలో హెచ్చరికలు ఉండాలని కోర్టు నిర్దేశించింది. అన్నింటినీ కలిపి ఒకే గుర్తులో కాకుండా, "అధిక కొవ్వు (HIGH FAT)", "అధిక చక్కెర (HIGH SUGAR)", "అధిక ఉప్పు (HIGH SALT)" అని ప్రతి పోషకానికి వేర్వేరుగా రెడ్ హెక్సాగన్ గుర్తును ముద్రించాలని స్పష్టం చేసింది. ఈ లేబుల్స్ ప్యాకెట్ ముందుభాగంలో సుమారు 4 నుంచి 5 శాతం స్థలాన్ని ఆక్రమించాలని, సాధారణ షాపింగ్ పరిస్థితులలో కూడా వినియోగదారులు సులభంగా చదవగలిగేలా పెద్ద అక్షరాలతో ఉండాలని సూచించింది.

'3S అండ్ అవర్ హెల్త్ సొసైటీ' అనే సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కేవలం అదనంగా కలిపిన చక్కెర, కొవ్వులను మాత్రమే కాకుండా ఆహార పదార్థంలోని మొత్తం చక్కెరలు, శాంతృప్త కొవ్వు (saturated fat) ఆధారంగా ఈ హెచ్చరికల పరిమితులను నిర్ణయించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని ఆదేశించింది. ఇది కంపెనీల బాధ్యతను మరింత పెంచే కీలకమైన అంశం.

అంతేకాకుండా పాఠశాల విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన పెంచేందుకు పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురావాలని, ప్రాక్టికల్ యాక్టివిటీస్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నిబంధనల ముసాయిదా ఖరారుకు సుమారు 4 నెలలు, వాటిని అమలు చేయడానికి పరిశ్రమకు 365 రోజుల సమయం ఇస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ కోర్టుకు ప్రతిపాదించింది. 

ఈ కాలపరిమితి సహేతుకంగానే ఉందని పేర్కొన్న ధర్మాసనం, దీనికి కచ్చితంగా కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపులు ఉండకూడదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ప్రజారోగ్యం దిశగా ఈ తీర్పు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.