సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' చిత్రంలో మనవడిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు 13 ఏళ్ల రిత్విక్ జ్యోతి రాజ్. తాజాగా ఈ బాల నటుడు సరికొత్త అవతారమెత్తి, తన స్నేహితులతో కలిసి ఒక సాఫ్ట్‌వేర్ సంస్థను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రిత్విక్, తన స్నేహితులతో కలిసి వీడియో కాల్స్‌లో మాట్లాడుకుంటున్న సమయంలో బోర్ కొట్టిందని, ఆ క్రమంలోనే ఒక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని తెలిపాడు. తమకు తెలిసిన ప్రాథమిక కోడింగ్ పరిజ్ఞానంతోనే ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. తనకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై పట్టు ఉందని, రోబోటిక్స్‌పై కూడా మక్కువ ఉందని రిత్విక్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఈ సంస్థ వెబ్‌సైట్ ద్వారా కొన్ని ఉత్పత్తులను, కోర్సులను అందిస్తోంది. అయితే, తమ వెబ్‌సైట్‌కు సందర్శకుల సంఖ్య తక్కువగానే ఉందని, సంస్థ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని రిత్విక్ వెల్లడించాడు. ఈ వెంచర్‌లో ఐదుగురు ప్రధాన సభ్యులు ఉండగా, మరో ఐదుగురు సహాయకులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం దీని ద్వారా ఎలాంటి ఆదాయం రావడం లేదని స్పష్టం చేశాడు.

'రితు రాక్స్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో కామెడీ స్కిట్ల ద్వారా గుర్తింపు పొందిన రిత్విక్.. ఆ తర్వాత 'ఓ 2', 'సర్దార్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల్లో నటించాడు. 'జైలర్' (2023) చిత్రంతో రిత్విక్‌కు విశేష గుర్తింపు లభించింది. నటనతో పాటు కామిక్ బుక్ రైటర్ కావాలనేది తన ఆశయమని రిత్విక్ గతంలో వెల్లడించాడు. చిన్న వయసులోనే అటు నటన, ఇటు టెక్నాలజీతో పాటు సృజనాత్మక రంగాల్లో రాణిస్తుండటం విశేషం.