బీహార్‌లో ఓ ఎమ్మెల్యే కూతురి వివాహ వేడుక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది పెళ్లా? లేక జాతరా? అన్నట్టుగా జరిగిన ఈ వేడుకకు ఏకంగా ఐదు లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. మొకామా ఎమ్మెల్యే అనంత సింగ్, స్థానికంగా 'ఛోటే సర్కార్' అని పిలుచుకునే ఆయన, తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి తన పలుకుబడిని మరోసారి చాటుకున్నారు. ఈ భారీ వేడుక కారణంగా పట్నాలోని నడవాన్ గ్రామ పరిసరాల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.

వివరాల్లోకి వెళితే.. అనంత సింగ్ చిన్న కుమార్తె శివంగి సింగ్‌కు, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ రణవిజయ్ కుమార్ కుమారుడు రిషికేష్ కుమార్‌తో బుధవారం వివాహం జరిగింది. ఈ వేడుకకు ఎస్‌యూవీ సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి, చేతిలో కాషాయ కండువా ఊపుతూ అభిమానులకు అభివాదం చేస్తూ అనంత సింగ్ ఇచ్చిన ఎంట్రీ అందరినీ ఆకర్షించింది. రోడ్ల పక్కన భారీగా ఆహార శాలలు ఏర్పాటు చేయడం, భవనాలపై నుంచి లౌడ్ స్పీకర్లలో పాటలు హోరెత్తడంతో ఆ ప్రాంతమంతా ఓ పెద్ద పండుగ వాతావరణం నెలకొంది.

కరెంట్ స్తంభాలెక్కిన జనం.. గుర్రపు పందెం ప్రత్యేకాకర్షణ
ఈ వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన గుర్రపు పందెం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పందెంలో గెలిచిన వారికి సరికొత్త మహీంద్రా థార్ కారును బహుమతిగా ప్రకటించారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాల నుంచి 52 గుర్రాలను ఈ పోటీల కోసం తీసుకొచ్చారు. అయితే, ఈ పందెం చూసేందుకు జనం పోటెత్తారు. వేదిక వద్ద తోపులాట జరగడంతో పాటు కొందరు ఏకంగా కరెంట్ స్తంభాలు, సెల్‌ఫోన్ టవర్లు ఎక్కి మరీ పందెం చూసేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన నిర్వాహకులు, ఫైనల్ రేసును మధ్యలోనే నిలిపివేశారు. ఫైనల్ పోటీని నేడు నిర్వహించనున్నట్టు తెలిపారు.

హెలిప్యాడ్ ఏర్పాటు.. వీఐపీల రాక
ఈ వివాహానికి వీఐపీ అతిథుల కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ నిర్మించడం గమనార్హం. కేంద్ర మంత్రి లలన్ సింగ్, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు హెలికాప్టర్‌లో వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి ఎవరికీ ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదని, "ఇదేమీ సినిమా కాదు కదా, టికెట్ తీసుకోవడానికి" అని అనంత సింగ్ ముందే ప్రకటించారు. 

ఆయన తండ్రి చంద్రదీప్ సింగ్ ఒకప్పుడు గుర్రపు బగ్గీల వ్యాపారం చేసేవారు. ఆ వారసత్వాన్ని గుర్తుచేస్తూ 2013లో అనంత సింగ్ గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు తన కూతురి పెళ్లిని కూడా అదే స్థాయిలో నిర్వహించి ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.