నేపాల్‌లో ఈ ఏడాది ఆగస్టు 26న సంభవించిన భయానక వరదల్లో గల్లంతైన 213 మంది భారతీయులను మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా, గల్లంతైన వారి జాబితాను విడుదల చేసి, వారి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం గల్లంతైన భారతీయుల కుటుంబాలకు కీలక సూచనలు జారీ చేసింది.

నేపాల్ జాతీయ విపత్తు నష్ట నివారణ, నిర్వహణ అథారిటీ గల్లంతైన 213 మంది భారతీయ పౌరుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు, మార్పులు లేదా చేర్పులు ఉంటే డిసెంబర్ 2వ తేదీలోగా తెలియజేయాలని కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం కోరింది. కుటుంబ సభ్యులు ఈ గడువులోగా తమ అభ్యంతరాలను సమర్పించాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నేపాల్ ప్రభుత్వం తుది జాబితాను ఖరారు చేసి, గల్లంతైన వారిని మరణించినట్లుగా అధికారికంగా ప్రకటిస్తుందని రాయబార కార్యాలయం వివరించింది. ఈ ప్రకటన వెలువడిన అనంతరం, మరణ ధ్రువీకరణ పత్రాలను నేపాల్‌లోని సంబంధిత స్థానిక అధికారుల నుంచి పొందే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి అదనపు సమాచారం, పత్రాలు అవసరం కావొచ్చని, తదుపరి అప్‌డేట్స్‌ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.

ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన వరదల కారణంగా 1,400 మందికి పైగా మరణించగా, విదేశీయులతో సహా 5,000 మందికి పైగా గల్లంతయ్యారు. భోటెకోశి, త్రిశూలి నదీ తీరాల్లో సుమారు డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు సహా భారీగా మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇంతకాలంగా గల్లంతైన వారిని, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం మరణించినట్లుగా ప్రకటించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా 12 దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాల ద్వారా 452 మంది విదేశీయుల వివరాలు అందాయి. వీరిలో అత్యధికంగా 213 మంది భారతీయులు ఉండగా, 85 మంది చైనీయులు, 69 మంది అమెరికన్లు, 32 మంది బ్రిటిష్ జాతీయులు, 27 మంది కెనడియన్లు కూడా ఉన్నారు.