రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దినపత్రికల్లో "రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు ఒక నిబద్ధత" పేరిట ప్రత్యేక వ్యాసం రాశారు. రాజ్యాంగ సూత్రాలు కేవలం పార్లమెంటు, న్యాయస్థానాలకే పరిమితం కాకుండా, ప్రతి పౌరుడి దైనందిన జీవితంలో అంతర్భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌లకు ఘన నివాళులర్పించిన ప్రధాని.. సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి దేశ ప్రధాని స్థాయికి చేరుకోగలగడం మన రాజ్యాంగ వైశిష్ట్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

సామాజిక, ఆర్థిక న్యాయం చేకూర్చాలన్న రాజ్యాంగ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను అమలు చేస్తోందని మోదీ తెలిపారు. జీఎస్టీ (101వ సవరణ), జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా (102వ సవరణ), ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు (103వ సవరణ) వంటివి తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కీలక రాజ్యాంగ సవరణలని ఆయన వివరించారు.

గత ప్రభుత్వాల వైఖరిపై ప్రధాని తన వ్యాసంలో విమర్శలు సంధించారు. ఒక రాజకీయ పార్టీ గతంలో సుమారు వందసార్లు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దడంగా ఆయన అభివర్ణించారు. ప్రధాన ప్రతిపక్షం 'విరోధ్ పక్ష్' (ప్రతిపక్షం)గా కాకుండా 'అవరోధ్ పక్ష్' (అడ్డంకులు సృష్టించే పక్షం)గా మారిందని ప్రధాని ఎద్దేవా చేశారు.

2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు "భారత్ ఫస్ట్ అనే ఆలోచన, కర్తవ్యం అనే ఆచరణ" అనే రెండు సూత్రాలు మనకు మార్గదర్శకాలు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.