ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది స్పష్టతనిచ్చారు. పవన్ కల్యాణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం షూటింగ్ ఆలస్యం కావడం వల్లే పరస్పర అంగీకారంతో ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగానని ఆయన వెల్లడించారు. తన తాజా చిత్రం 'భోగి' ప్రమోషన్స్ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

వాస్తవానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి మొదట సంపత్ నంది దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో పవన్ ఇతర కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటంతో సినిమా ప్రారంభం ఆలస్యమైంది. ఈ విషయంపై సంపత్ నంది మాట్లాడుతూ... "నేనే మొదట ఆ సినిమాకు డైరెక్టర్. అప్పుడు పవన్ కల్యాణ్ వరుస సినిమాలు, వేరే కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ఆలస్యమయింది. ఆ సినిమా మరింత లేట్ గా మొదలవుతుందని తెలిసి ఒకరోజు పవన్ కల్యాణ్ గారే స్వయంగా నన్ను పిలిచి మాట్లాడారు. సినిమా మొదలవ్వడానికి కొంత సమయం పట్టేలా ఉంది. అప్పటివరకు వెయిట్ చేయగలరా అని నన్ను అడిగారు" అని వెల్లడించారు.

అనంతరం తాను స్పందిస్తూ... "నేను ఈ గ్యాప్‌లో వేరే సినిమా పూర్తి చేసుకుంటే మీకు ఇబ్బందేమీ లేదు క‌దా.. అని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గారిని అడిగాను" అని తెలిపారు. అలా ఎలాంటి గొడవలు లేకుండా, చాలా సాఫీగా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. ఎవరినీ ఎక్కువ సమయం ఎదురుచూసేలా చేయడం పవన్ కల్యాణ్‌కు ఇష్టం ఉండదని, తనతో సినిమా చేసేందుకు ఆయన చివరి వరకు ప్రయత్నించారని సంపత్ నంది గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.