మహారాష్ట్రలోని బారామతిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఓ థార్ ఎస్‌యూవీ డ్రైవర్ ఢీకొట్టి, బానెట్‌పై 50 అడుగుల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో పోలీసు అధికారి చేతికి, కాలికి గాయాలయ్యాయి. ఈ షాకింగ్ సంఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

వివరాల్లోకి వెళితే.. ట్రాఫిక్ పోలీస్ దత్తాత్రేయ భోసలే తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నల్ల రంగు థార్ కారుకు అక్రమంగా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండటాన్ని గమనించారు. దానికి జరిమానా విధించేందుకు సాక్ష్యంగా ఫొటో తీయడానికి ప్రయత్నించారు. భోసలే కారు ముందు నిలబడి ఈ-చలాన్ కోసం ఫొటో తీస్తుండగా ఈ ఘటన జరిగింది.

భోసలే ఫొటో తీసేందుకు సిద్ధమవ్వగానే, థార్ డ్రైవర్ ఒక్కసారిగా కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో భోసలే బానెట్‌పై పడిపోయారు. డ్రైవర్ కారును ఆపకుండా సుమారు 50 అడుగుల దూరం అతడిని లాక్కెళ్లాడు. ఆ తర్వాత పట్టుతప్పి కిందపడిపోయిన భోసలే, వాహనం టైర్ల కింద పడకుండా త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటన అనంతరం డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.