ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం వల్ల అపారమైన నీరు వృథా అయిపోతోందన్న ఆందోళనలకు సరికొత్త అధ్యయనం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మనం ఖర్చు చేసే ప్రతి డాలర్‌కు బాదం పాలు లేదా గోల్ఫ్ ఆడేందుకు ఖర్చయ్యే నీటితో పోలిస్తే, ఏఐ వినియోగించే నీరు చాలా తక్కువని ‘ఎన్వెరస్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.

నెలవారీ ఖర్చులను ప్రామాణికంగా తీసుకుని రూపొందించిన "డేటా సెంటర్ వాటర్ యూజ్- సెట్టింగ్ ది రికార్డ్ స్ట్రెయిట్" అనే నివేదిక పలు ఆసక్తికర గణాంకాలను తెరపైకి తెచ్చింది. ఏఐ సేవల కోసం నెలకు 25 డాలర్లు ఖర్చు చేస్తే కేవలం 1.9 గ్యాలన్ల నీరు మాత్రమే ఖర్చవుతుందని అధ్యయనం తేల్చింది. ఇందులో డేటా సెంటర్లను నడిపే విద్యుదుత్పత్తికి వినియోగించే నీరు కూడా కలిసి ఉంది. అదే 25 డాలర్లను బాదం పాలపై ఖర్చు చేస్తే ఏకంగా 308 గ్యాలన్ల నీరు ఖర్చవుతుండగా, గోల్ఫ్ కోర్సు ఫీజుల కోసమైతే ఏకంగా 679 గ్యాలన్ల నీరు వ్యయమవుతోంది. ఇక పూర్తిగా సహజవాయువు ఆధారిత విద్యుత్ గ్రిడ్‌పై అంతే మొత్తాన్ని వాడితే సుమారు 31 గ్యాలన్ల నీరు ఖర్చవుతుంది.

వాటర్ ఫుట్‌ప్రింట్ గురించి ఆందోళన చెందే సాధారణ వినియోగదారులు, ఏఐ చాట్‌బాట్లను పూర్తిగా మానేయడం కంటే వారానికి ఒక్క బాదం లాట్‌ తాగడం మానేస్తేనే ఎక్కువ నీటిని ఆదా చేసినట్లు అవుతుందని ఎన్వెరస్ ఎనర్జీ ట్రాన్సిషన్ రీసెర్చ్ డైరెక్టర్ ర్యాన్ లూథర్ స్పష్టం చేశారు. ఏఐ మోడళ్ల వాడకంలో ఖర్చయ్యే నీటిలో దాదాపు 90 శాతం నేరుగా డేటా సెంటర్లలో కాకుండా, వాటికి విద్యుత్ సరఫరా చేసే పవర్ ప్లాంట్లలోనే వినియోగమవుతున్నట్లు నివేదిక గుర్తించింది. ఆధునిక హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ నెలకు ఎకరాకు సుమారు 32,100 గ్యాలన్ల నీటిని మాత్రమే వాడుతుందని, ఇది వరి, బాదం, అల్ఫాల్ఫా పంటల కంటే తక్కువని, సాధారణ గోల్ఫ్ కోర్సుతో సమానమని తేలింది.