ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తొలి దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా, కొత్తగా ఏర్పాటైన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎంఎస్‌ఎస్ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 34/3 నంబర్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న పవన్, సామాన్య ఓటరులా క్యూలైన్‌లో నిల్చొని తన ఓటు వేశారు. ఆయన రాకతో పోలింగ్ కేంద్రం వద్దకు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తరలివచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ‌మైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఓటు వేసిన అనంతరం పవన్ కల్యాణ్ తన వేలికి ఉన్న సిరా గుర్తును మీడియాకు చూపించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు మొదటి విడత పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.