హారర్ వైపు నుంచి .. ఫాంటసీ జోనర్ నుంచి .. ఫిక్షన్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు, ఓటీటీ ఆడియన్స్ వైపు నుంచి విపరీతమైన రెస్పాన్స్ కనిపిస్తోంది. అలాంటిది ఈ అంశాలన్నిటినీ కలుపుకుని రూపొందిన ఒక సినిమా ఓటీటీ ట్రాక్ పైకి వచ్చిందంటే ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అలా రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'డ్రోన్స్'. అక్టోబర్ 16వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ .. హిందీ భాషల్లోను అందుబాటులో ఉంది.

నగరంలో 'సైకో' డాన్సర్ వరుస హత్యలు చేస్తూ వెళుతుంటాడు. అతని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ మాధవన్ (సతీశ్) షెర్లాక్ హోమ్స్ ( శశి సెల్వరాజ్) రంగంలోకి దిగుతారు. ఇదే సమయంలో కిశోర్ (ద్రావిడ్ సెల్వమ్) .. రష్మిక (అంజలి నాయర్) .. దశ్ (దీపక్) కాలేజ్ ఎగ్గొట్టి సెకండ్ షో సినిమాకి వెళతారు. అక్కడ జరిగిన ఒక సంఘటన కారణంగా, అనుకోకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లవలసి వస్తుంది. ఈ విషయం కాలేజ్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో 10 రోజుల పాటు వాళ్లను సస్పెండ్ చేస్తారు.

ఇంటికి వెళ్లడం ఇష్టం లేని మిత్ర బృందానికి, గతంలో అదే కాలేజ్ లో చదివిన పద్మనాభం (కురైషి) గురించి తెలుస్తుంది. హాస్టల్ వాళ్లకు ఇబ్బంది అయితే ఆదుకునే అలవాటు ఉన్న వ్యక్తి అతను. అతను 'బ్లాక్ హోల్' అనే తన బంగ్లాలో వాళ్లకి ఆశ్రయం కల్పిస్తాడు. అతను ఆ బంగ్లాలో ఏవో ప్రయోగాలు చేస్తుంటాడు. పద్మనాభం బంగ్లాలో ఉన్న కిశోర్ టీమ్ కి బయటి ప్రపంచం గురించి తెలియకుండా పోతుంది. ఆ ఇంట్లో ఏ పని కావాలన్నా 'డ్రోన్' తోనే చెప్పాలి. 

కెమెరా కలిగిన డ్రోన్ ను బయటికి పంపించిన కిశోర్, ఒక పాడుబడిన బంగ్లాలో ఒక అందమైన అమ్మాయి ఉండటం చూస్తాడు. తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. ఒక రోజున డ్రోన్ కెమెరాలో ఆ అమ్మాయి కనిపించకపోవడంతో, కిశోర్ నేరుగా ఆ ఇంటికి వెళతాడు. ఆమె పేరు 'ప్రకృతి' అని తెలుసుకుంటాడు. తన మనసులోని మాటను ఆమెకి చెబుతాడు. తాను ఒంటరిగా ఉండటం లేదనీ, తన బామ్మ వచ్చేలోగా పారిపొమ్మని ప్రకృతి అంటుంది. 

ఆ పాడుబడిన ఇంట్లో ఎన్నో మగ బొమ్మలు వ్రేళ్లాడుతూ ఉంటాయి. ఆ ఇంట్లో ప్రకృతి అనే అందమైన యువతితో పాటు ఆమె బామ్మ అయిన మాంత్రికురాలు ఉంటుంది. తన మనవరాలిని ఎవరూ చూడకుండా .. ప్రేమించకుండా ఆమె అక్కడ రహస్యంగా ఉంచుతోందని కిశోర్ తో పాటు అతని స్నేహితులు భావిస్తారు. ఆ మాంత్రికురాలు ఎవరు? ప్రకృతితో కలిసి ఆమె అక్కడ ఎందుకు ఉంటుంది? పద్మనాభం చేస్తున్న ప్రయోగం ఏమిటి? సైకో డాన్సర్ ఎవరు? అనేది మిగతా కథ.

ఒక వైపున సిటీలో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో డాన్సర్ .. మరొక వైపున కాలేజ్ నుంచి సస్పెండ్ చేయబడిన ముగ్గురు స్టూడెంట్స్ .. ఇంకొక వైపున ఒక పాడుబడిన బంగ్లాలో నివసిస్తున్న మాంత్రికురాలు .. ఈ మూడు అంశాలను కలుపుకుంటూ అల్లిన కథ ఇది. సైకో డాన్సర్ ఎవరు? ముగ్గురు స్టూడెంట్స్ కి ఎదురయ్యే అనుభవాలు ఎలాంటివి? పాడుబడిన బంగ్లాలో నివసిస్తున్న మాంత్రికురాలు ఉద్దేశం ఏమిటి? అనేది ఈ కథలో ప్రధానంగా కనిపించే అంశాలు. వీటి చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. 

ఈ సినిమా పోస్టర్స్ చూడగానే దర్శకుడు ఈ కంటెంట్ ను కామెడీతో నడిపించాడనే విషయం అర్థమైపోతుంది. సిటీలో సైకో డాన్సర్ వలన హత్యలు జరుగుతున్న తీరు .. ముగ్గురు స్టూడెంట్స్ కి ఎదురయ్యే చిత్రమైన అనుభవాలు .. మాంత్రికురాలు సృష్టించే భయానక వాతావరణం అంతా కూడా కామెడీ టచ్ తోనే నడుస్తూ ఉంటుంది. అయితే ఆశించిన స్థాయిలో కామెడీ పేలకపోవడమే ఇక్కడ కనిపించే ప్రధానమైన సమస్య అని చెప్పాలి. 

దర్శకుడి వాయిస్ ఓవర్ తో ఈ కథ మొదలవుతుంది. వాయిస్ ఓవర్ వింటున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. పెద్దవాళ్లు తమ మైండ్ సెట్ ను చైల్డ్ మోడ్ లోకి మార్చుకుని ఈ సినిమా చూస్తే వచ్చే కిక్కు వేరని చెబుతారు. కానీ అలాంటి కిక్ మనకి ఎక్కదు .. ఎక్కడా కనిపించదు. మొత్తం కథ నాలుగు గోడల మధ్య .. ఏడు పాత్రల మధ్య నడుస్తుంది. ఏ పాత్రను కూడా విభిన్నంగా .. విలక్షణంగా మలచినట్టుగా అనిపించదు. 

సైకో డాన్సర్ ఎవరు .. స్టూడెంట్స్ ఎలా బయటపడతారు? మాంత్రికురాలి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అనేవి ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తించే అంశాలుగా కనిపిస్తాయి. కానీ ఇందుకు సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా పేలవంగానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను తట్టి లేపలేకపోతాయి. నటీనటుల నటన .. సాంకేతిక నిపుణుల నైపుణ్యం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు. 

సినిమా మొత్తం మీద ఒక డ్రోన్ చూపించి, దానినే టైటిల్ గా సెట్ చేయడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కామెడీ టచ్ కారణంగా హత్యలకు సంబంధించిన ట్రాక్ గానీ .. మాంత్రికురాలికి సంబంధించిన దృశ్యాలుగానీ నవ్వించలేకపోయాయి. ఇక స్టూడెంట్స్ కి సంబంధించిన కామెడీ సీన్స్ మాత్రం నవ్వించలేకపోగా భయపెడతాయి. కనుక ఈ సినిమా చూడాలంటే ఓపికతో పాటు ధైర్యం కూడా అవసరమే అనే విషయాన్ని గ్రహించవలసి ఉంటుంది.