ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్, హైదరాబాద్ నగరంలో తన కొత్త రిటైల్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 'యాపిల్ కూకట్‌పల్లి' పేరుతో రానున్న ఈ స్టోర్‌ను డిసెంబర్ 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. కూకట్‌పల్లిలోని లేక్ షోర్-వై జంక్షన్ మాల్‌లో ఇది ఏర్పాటు కానుంది. దేశంలో యాపిల్‌కు ఇది ఏడో స్టోర్ కాగా, హైదరాబాద్ ఆరో నగరంగా నిలిచింది.

ఈ స్టోర్ ప్రారంభానికి ముందు, యాపిల్ ఒక ప్రత్యేకమైన బారికేడ్‌ను ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు ఉన్న 'ముత్యాల నగరం' అనే గుర్తింపును ప్రతిబింబించేలా, ముత్యం స్ఫూర్తితో రూపొందించిన లోగోను ఇందులో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ముత్యాలను శుద్ధి చేసే హైదరాబాద్ వారసత్వానికి ఇది నిదర్శనమని యాపిల్ వివరించింది. 

వినియోగదారుల కోసం ప్రత్యేకమైన యాపిల్ కూకట్‌పల్లి వాల్‌పేపర్లు, స్టిక్కర్లను కూడా యాపిల్ అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ స్ఫూర్తితో ఒక ప్రత్యేక యాపిల్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌ను కూడా రూపొందించింది.

ఈ కొత్త స్టోర్‌లో కస్టమర్లు ఐఫోన్ 18 ప్రో సిరీస్, ఐఫోన్ డ్యుయో, మ్యాక్‌బుక్ ప్రో, హోమ్‌వ్యూ వంటి యాపిల్ ఉత్పత్తుల పూర్తి శ్రేణిని కొనుగోలు చేయవచ్చు. నిపుణుల సలహాలు, సూచనలు కూడా పొందవచ్చు. ఫోటోగ్రఫీ, వీడియో, డ్రాయింగ్‌లపై ప్రత్యేక వర్క్‌షాప్‌లను కూడా యాపిల్ నిర్వహించనుంది.

ఇప్పటికే హైదరాబాద్‌లో యాపిల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, రిటైల్ కస్టమర్ కేర్ బృందాలు ఉన్నాయని కంపెనీ గుర్తుచేసింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ముంబై, నోయిడా, బెంగళూరు, పుణె నగరాల్లో యాపిల్ కొత్త స్టోర్లను తెరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అడుగుపెట్టడంతో టెక్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.