ఒకవైపు కూతురి పెళ్లి సంబరాలు.. మరోవైపు కుటుంబ పెద్ద మరణం. ఆనందం, విషాదం ఒకేసారి ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కూతురి పెళ్లికి ముందు జరిగే వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఓ తండ్రి గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. ఈ తీవ్ర విషాద సమయంలోనూ, ఆ కుటుంబం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తండ్రి అంత్యక్రియలకు ముందే కూతురి పెళ్లి పూర్తి చేయాలని నిశ్చయించుకుని, కన్నీళ్లు దిగమింగుకుని వివాహం జరిపించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

ఉదయ్‌పూర్ జిల్లా రిషభ్‌దేవ్ సబ్ డివిజన్‌లోని పటియార్ గ్రామానికి చెందిన శంకర్‌లాల్ మేఘ్వాల్ (51), అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు ప్రియాంక (26) వివాహం నవంబర్ 21న జరగాల్సి ఉంది. దీనికి ముందు నవంబర్ 20 రాత్రి, 'బిందోలి' అనే సంప్రదాయ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులతో కలిసి శంకర్‌లాల్ ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేశారు. ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

కుటుంబ సభ్యులు, కుమారులు దిలీప్, ఉమేష్ వెంటనే ఆయనను రిషభ్‌దేవ్‌లోని ఆసుపత్రికి, ఆ తర్వాత ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. మరుసటి రోజే చెల్లి పెళ్లి జరగాల్సి ఉండటంతో కుమారులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. తండ్రి మరణ వార్త తెలిస్తే తల్లి, చెల్లి తట్టుకోలేరని, పెళ్లి వేడుక ఆగిపోతుందని భావించారు. తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, మాట్లాడే స్థితిలో లేరని ఇంట్లోవారిని నమ్మించారు.

వెంటనే వరుడి కుటుంబానికి సమాచారం అందించి, పెళ్లి త్వరగా పూర్తి చేయాలని కోరారు. దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అదే రాత్రి పెళ్లి వేదికకు చేరుకున్నారు. నవంబర్ 21 తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రియాంక వివాహ తంతును పూర్తి చేశారు. కూతురి అప్పగింతలు ముగిసిన తర్వాత, అదే రోజు శంకర్‌లాల్ అంత్యక్రియలను నిర్వహించారు.

అత్తారింటికి వెళ్లిన ప్రియాంకకు, ఆమె సోదరుడు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు. తన తండ్రిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయానని ఆమె తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భర్త మరణవార్త తెలియడంతో తల్లి కూడా అనారోగ్యం పాలయ్యారు.