పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సువేందు అధికారి భారత మాజీ రాష్ట్రపతి, దివంగత కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వీడి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బీజేపీ వైపు వెళ్లాలని నాడు రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రణబ్ ముఖర్జీయే తనకు సలహా ఇచ్చారని ఆయన తెలిపారు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు.

తనకు మార్గదర్శి, అసలైన సలహాదారు ప్రణబ్ ముఖర్జీయేనని సువేందు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక తాను రాష్ట్రపతి భవన్‌లో ఆయన్ను కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. "నువ్వు ఇంకా ఓ ఉద్యోగిలా మిగిలిపోవాలనుకుంటే అక్కడే ఉండు.. సొంతంగా ఎదగాలనుకుంటే మోదీజీతో నడువు" అని ప్రణబ్ తనతో అన్నట్లు వివరించారు. 

టీఎంసీ అత్తా-అల్లుళ్ల ప్రైవేట్ కంపెనీలా నడుస్తోందని, మేనేజింగ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లా వ్యవహరిస్తున్నారని ప్రణబ్ ఆనాడే అభిప్రాయపడ్డారని చెప్పారు. తాను కేవలం ఉద్యోగిలా ఉండటం ఇష్టం లేకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని సువేందు స్పష్టం చేశారు. అయితే ఈ భేటీ తేదీని వెల్లడించేందుకు సువేందు నిరాకరిస్తూ, దివంగత నేత చుట్టూ అనవసర వివాదాలు రావడం ఇష్టం లేదన్నారు.

టీఎంసీలో నందిగ్రామ్ ఉద్యమం ద్వారా అగ్రనేతగా ఎదిగిన సువేందు అధికారి, అభిషేక్ బెనర్జీ ప్రాబల్యం పెరిగిన తర్వాత 2020లో బీజేపీలో చేరారు. 2021లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయన, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్‌లోనూ ఆమెపై గెలుపొంది బెంగాల్‌లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన ప్రణబ్ ముఖర్జీ, బీజేపీ వైపు వెళ్లాలని సూచించారంటూ సువేందు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.