ప్రపంచంలోని ఏ శక్తిమంతమైన దేశం కూడా భారత్‌ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ‘బలవంతుడిదే పైచేయి’ అనే సిద్ధాంతాన్ని విశ్వసించే శక్తిమంతమైన దేశాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికే ఇతరులను నిరంతరం ఒత్తిడిలో ఉంచుతాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జ్ఞానయజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదో ‘పద్మ ఫెస్టివల్’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ వేగంగా అభివృద్ధి చెందితే ఇతర దేశాల దుకాణాలు మూతపడతాయనే ఆందోళన వాటిలో ఉందని మోహన్ భగవత్ పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలనే భావిస్తుందని, చివరకు తమను ద్వేషించే పొరుగు దేశాలకు కూడా ఆపత్కాలంలో అండగా నిలిచిందని గుర్తుచేశారు. సంక్షోభ సమయంలో మాల్దీవులకు తాగునీరు అందించడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు చేయూతనివ్వడం, నేపాల్, బంగ్లాదేశ్‌లకు తోడ్పాటు అందించడం వంటి అంశాలను ప్రస్తావించారు. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పాకిస్థాన్‌కు సైతం భారత్ మానవతా దృక్పథంతో సహాయం చేసిందని ఆయన వివరించారు. నేటి తరం యువత బానిసత్వపు ఆలోచనల నుంచి బయటపడిందని, అబద్ధాలను ఏమాత్రం సహించకుండా దేశాన్ని ఉన్నతంగా నిలిపేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.