జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే తీవ్ర నిరసన ఎదురైంది. తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను జనసేన మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధి అయి ఉండి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనను చుట్టుముట్టి సూటిగా నిలదీశారు.

పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపరిచిన గుంటిపల్లి నాగమణికి కాకుండా, స్వతంత్ర అభ్యర్థి పూరం రమణమ్మకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం చేయడంపై స్థానిక మహిళా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. "జనసేన పార్టీ తరఫున 'గాజు గ్లాసు' గుర్తుపై గెలిచిన మీరు, ఇప్పుడు వేరొకరికి ఎలా ప్రచారం చేస్తారు? ఇందుకోసమేనా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంది?" అంటూ మహిళలు నిలదీశారు. గత పరిషత్ ఎన్నికల సమయంలోనూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కనీసం ప్రచారానికి కూడా రాలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారని నిలదీశారు.

సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఊహించని రీతిలో ప్రశ్నల వర్షం కురవడంతో ఎమ్మెల్యే శ్రీధర్ తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. నిరసనకారుల ఆగ్రహం చూసిన అనంతరం, ఈ వ్యవహారంలో తనది తప్పేనని ఆయన బహిరంగంగా అంగీకరించినట్లు తెలిసింది. ప్రచారంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేనలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.