తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు కూల్చివేశారంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

"హే రామ్! ఆలయాలను రక్షించండి! ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి!" అంటూ వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. కోట్ల మంది భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా ఉన్న పురాతన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం అత్యంత బాధాకరమని అన్నారు. గతంలో తిరుమల వెయ్యి కాళ్ల మండపం తొలగింపు, విజయవాడ కృష్ణా పుష్కరాల సమయంలో 40 ఆలయాల కూల్చివేత, బద్వేల్‌లోని కాశీనాయన జ్యోతి క్షేత్రం ధ్వంసం వంటి ఘటనలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు హయాంలో ఎలాంటి ప్రత్యామ్నాయాలూ అన్వేషించకుండా పవిత్ర కట్టడాలను కూల్చివేసే ధోరణి కొనసాగుతోందని ఆరోపించారు.

తమ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం ‘శ్రీవాణి ట్రస్ట్’ను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం చారిత్రక వారసత్వ సంపదను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని రక్షించడమంటే ఇదేనా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించారు. జాతీయ రహదారి 716 విస్తరణ కోసం రోడ్డు మార్గాన్ని (అలైన్‌మెంట్) మార్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పురాతన ఆలయాన్ని కూల్చివేసిందని ఒక వీడియో ప్రకటనలో ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హిందూ ధర్మాన్ని కాపాడే విధానం ఇదేనా అని ఆయన నిలదీశారు.

కరకంబాడి సమీపంలో ఉన్న సంపన్న వర్గాల భూములు, ఆస్తులను కాపాడేందుకే జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ను మార్చారని, దీనివల్లే చారిత్రక అభయాంజనేయ స్వామి ఆలయం బలైపోయిందని భూమన ఆరోపించారు. ఈ ఆలయ విశిష్టతను వివరిస్తూ, ఇక్కడి స్వామివారు స్వయంభూ అని, అగస్త్య మహర్షి భార్య లోపాముద్రతో ఈ క్షేత్రానికి సంబంధం ఉందని పేర్కొన్నారు. దాదాపు 1,400 ఏళ్ల క్రితం పల్లవ రాజులు ఈ ఆలయ గోపురం, కోనేరు నిర్మించారని, తాళ్లపాక అన్నమాచార్యులు కూడా స్వామివారిని కీర్తిస్తూ సంకీర్తనలు రచించారని గుర్తుచేశారు. కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి సైతం ఇక్కడ విశేష పూజలు నిర్వహించారని తెలిపారు. ఈ ఆలయ ప్రాధాన్యతను గుర్తించే గతంలో బ్రిటిష్ పాలకులు కూడా మామండూరు సమీపంలో అంజనేయపురం రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారని వివరించారు.

ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం నాడు, కనీసం వేద పండితుల పర్యవేక్షణ కూడా లేకుండా జేసీబీలతో ఆలయాన్ని నేలమట్టం చేయడం తీవ్రమైన అపచారమని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సనాతన ధర్మాన్ని కాపాడతామని చెబుతూనే, మరోవైపు ప్రాచీన ఆలయాన్ని కూల్చివేసి హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని ఆయన విమర్శించారు.