టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ స్పందించాడు. దేశం కోసం ధోనీ చేసిన సేవలు ఎనలేనివని, అతని స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని కొనియాడాడు. పాట్నాలో విలేకరులతో మాట్లాడిన ఇషాన్, ధోనీ రిటైర్మెంట్ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని అభిప్రాయపడ్డాడు.

"రిటైర్మెంట్ కు సమయం వచ్చిందని అతడు భావించాడు. ఇది సరైన సమయం అని అత‌నికి అనిపించింది" అని ఇషాన్ పేర్కొన్నాడు. ధోనీ లేడనే బాధ కంటే, అతడు దేశానికి, యువతకు అందించిన స్ఫూర్తిని గుర్తుంచుకోవడమే ముఖ్యమని నొక్కి చెప్పాడు. "దేశానికి అతడు ఎంత సేవ చేశాడో, యువ ఆటగాళ్లకు ఎలా స్ఫూర్తిగా నిలిచాడో మనమందరం అర్థం చేసుకోవాలి. అతడు సాధించిన విజయాల వల్ల మనలో ఎంతో ఆనందం ఉంది. బహుశా అతికొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే దేశం కోసం అతడు చేసినంత చేయగలరు" అని ఇషాన్ వివరించాడు.

ఇషాన్ కిషన్, ధోనీ ఇద్దరికీ ఝార్ఖండ్‌తో బలమైన అనుబంధం ఉంది. పాట్నాలో జన్మించిన ఇషాన్, చిన్నతనంలో రాంచీకి వెళ్లి ధోనీలాగే రాష్ట్రం తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ధోనీ తన చిన్ననాటి ఆరాధ్య దైవం అని, అత‌ని అడుగుజాడల్లో నడవాలని కోరుకున్నానని ఇషాన్ గతంలో పలు సందర్భాల్లో చెప్పాడు. 18 ఏళ్ల వయసులో ధోనీ ఆటోగ్రాఫ్‌ను తన బ్యాట్‌పై తీసుకున్న విషయాన్ని, ఝార్ఖండ్ జట్టు నెట్ సెషన్స్‌లో అత‌ని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.

2008లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన ధోనీ, ఫ్రాంచైజీకి ఐదుసార్లు టైటిల్ అందించాడు. కాలి కండరాల గాయం కారణంగా 2026 సీజన్‌కు దూరమైన అత‌డు, 2027 సీజన్ నుంచి జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం ఈ నెల‌ 17న అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మ‌హీ భాయ్‌ ఐపీఎల్ ప్లేయింగ్ కెరీర్‌కు ముగింపు పడినట్లయింది.