బీహార్‌లో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అమోర్ ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ముస్లిం వివాహాల్లో మహిళలు పర్దా (ముసుగు) పాటించకపోవడం, వధువు ముఖాన్ని బంధుమిత్రులకు చూపించే ‘ముహ్ దిఖాయీ’ ఆచారంపై ఆయన తీవ్ర అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.

ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఇమాన్... వివాహ వేడుకల్లో వధువు ముసుగు లేకుండా బహిరంగంగా కూర్చోవడాన్ని తవాయిఫ్ (వేశ్య)తో పోల్చారు. అలాగే వివాహాల్లో స్త్రీ, పురుషులు కలిసి తిరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మగవారి ప్రవర్తనను పందులతో పోల్చారు. ఈ రోజుల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువగా టోపీలు ధరిస్తున్నారని, ఇస్లాంలో మహిళలకు పర్దా పాటించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై రాజకీయ పక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బీహార్ బీజేపీ నేత డానిష్ ఇక్బాల్ స్పందిస్తూ.. ఇమాన్ తిరోగమన భావాలు కలిగిన మౌలానాలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రస్తుత కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, షరియా అంతగా నచ్చితే ఆయన ఆఫ్ఘనిస్థాన్ వెళ్లి జీవించాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేత ముంతాజ్ పటేల్ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇస్లాం ఎక్కడా మహిళలను ఇలా కించపరచదని స్పష్టం చేశారు. ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహలీ సైతం స్పందిస్తూ, నాగరిక సమాజంలో ఇలాంటి భాషకు తావులేదని అన్నారు.

అయితే, ఇంతటి వ్యతిరేకత వచ్చినా ఇమాన్ వెనక్కి తగ్గలేదు. సమయానికి నిద్రలేవని మొండి పిల్లాడికి వేసే చెంపదెబ్బ లాంటివే తన కఠిన పదాలని ఆయన పేర్కొన్నారు. హిందూ మహిళలకు సిందూరం ఎంత ముఖ్యమో, ముస్లిం మహిళలకు పర్దా అంతకంటే ముఖ్యమని వాదిస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.