ఆస్తి అమ్మకం లావాదేవీలో భాగంగా కొంత మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించిన ఒక విక్రేతకు ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) భారీ ఊరట కల్పించింది. విక్రేతపై విధించిన రూ. 6.75 లక్షల జరిమానాను రద్దు చేస్తూ చెన్నై ఐటీఏటీ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. లావాదేవీలో పారదర్శకత, విక్రేత చెప్పిన కారణం సహేతుకంగా ఉండటంతో ట్రైబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన వెట్రిచెల్వన్ విజయసారథి తన నివాస గృహాన్ని రూ. 32 లక్షలకు విక్రయించారు. ఈ మొత్తంలో రూ. 6.75 లక్షలను అడ్వాన్స్‌గా నగదు రూపంలో స్వీకరించారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతా ద్వారా పొందారు. విరుగంబాక్కం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను అధికారి, ఈ లావాదేవీని పరిశీలించారు. ఆస్తి అమ్మకంలో నగదు స్వీకరించడం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269SS నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించారు. ఈ కారణంగా సెక్షన్ 271D కింద రూ. 6.75 లక్షల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విజయసారథి ఐటీఏటీని ఆశ్రయించారు. తనకు అత్యవసరంగా ఆస్తిని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే బ్రోకర్‌ను సంప్రదించానని ట్రైబ్యునల్‌కు వివరించారు. వెల్లూరుకు చెందిన ఒక సీనియర్ సిటిజన్ ఇంటిని చూసి, కొనుగోలుకు వెంటనే అంగీకరించారని తెలిపారు. ఆ సమయంలో ఆయన వద్ద రూ. 6.75 లక్షల నగదు ఉందని, అంత డబ్బుతో తిరిగి ప్రయాణించడం ఇష్టం లేక వెంటనే అడ్వాన్స్ ఇస్తానని చెప్పారని పేర్కొన్నారు. కొనుగోలుదారు పరిస్థితిని, తన అమ్మకం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి ఉద్దేశంతోనే నగదును స్వీకరించానని వాదించారు.

విజయసారథి వాదనలను, కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఐటీఏటీ, అతని వివరణ సహేతుకంగా ఉందని అభిప్రాయపడింది. ఈ లావాదేవీని దాచిపెట్టే ప్రయత్నం జరగలేదని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. రిజిస్టర్డ్ సేల్ డీడ్‌లో పూర్తి అమ్మకం విలువను చూపించడం, ఆదాయపు పన్ను రిటర్నులలో ఈ విషయాన్ని వెల్లడించడం, అందుకు తగిన మూలధన ఆదాయ పన్ను చెల్లించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. అంతేకాకుండా తీసుకున్న నగదును వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేయడం, మిగిలిన మొత్తాన్ని బ్యాంకింగ్ మార్గాల ద్వారానే స్వీకరించడం వంటివి విక్రేత నిజాయతీని బలపరిచాయని పేర్కొంది.

ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సెక్షన్ 269SS నిబంధనల ఉల్లంఘన జరిగినప్పటికీ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 273B కింద 'సహేతుకమైన కారణం' చూపినందున విక్రేతకు రక్షణ లభిస్తుందని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో అసెసింగ్ అధికారి విధించిన రూ. 6.75 లక్షల జరిమానాను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది.