న్యూయార్క్ వేదికగా అట్టహాసంగా జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. గ్లోబల్ వేదికపై సత్తా చాటుతారనుకున్న ప్రముఖ కమెడియన్ వీర్ దాస్, సోనీలివ్ సిరీస్ 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్'లకు అవార్డులు దక్కలేదు. నవంబర్ 23న (భారత కాలమానం ప్రకారం నవంబర్ 24) జరిగిన ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా 16 కేటగిరీల్లో ఎంపిక చేసిన ఉత్తమ టెలివిజన్ షోలకు పురస్కారాలు అందించారు.

హాస్య విభాగంలో వీర్ దాస్ నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ 'వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్' నామినేట్ కాగా.. అర్జెంటీనాకు చెందిన 'డివిజన్ పాలెర్మో - సీజన్ 2' ఉత్తమ కామెడీ సిరీస్ అవార్డును ఎగరేసుకుపోయింది. 2023లో 'వీర్ దాస్: ల్యాండింగ్' షోతో ఎమ్మీ అవార్డును గెలుచుకున్న వీర్ దాస్‌కు ఇది మూడో నామినేషన్. మరోవైపు ఉత్తమ డ్రామా సిరీస్ విభాగంలో మానవ్ కౌల్, మహమ్మద్ జీషన్ అయ్యుబ్ నటించిన 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' పోటీ పడగా, ఫ్రాన్స్‌కు చెందిన 'కారేమ్' సిరీస్‌ను ఆ పురస్కారం వరించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన తొలి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రయాణం ఆధారంగా రాజేష్ మాపుస్కర్, మహేష్ మథాయ్ ఈ సిరీస్‌ను రూపొందించారు.

ఈ అవార్డుల్లో బ్రిటన్ ప్రొడక్షన్ల హవా స్పష్టంగా కనిపించింది. 'అన్‌ఫర్గివబుల్' చిత్రంలో నటనకు గాను యూకే నటుడు బాబీ స్కోఫీల్డ్ ఉత్తమ నటుడిగా నిలవగా, 'హోలీ షీట్' చిత్రానికి బెల్జియం నటి మోనా మినా లియాన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. డాక్యుమెంటరీ, న్యూస్, చిల్డ్రన్స్ ప్రోగ్రామింగ్ వంటి విభాగాల్లోనూ బ్రిటన్ సత్తా చాటింది. తుర్కియేకు చెందిన 'లేలా' ఉత్తమ టెలినోవెలాగా, యూకేకు చెందిన 'ప్రిజనర్ 951' బెస్ట్ టీవీ మూవీ/మినీ-సిరీస్‌గా నిలిచాయి. నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బేలా బజారియా ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డును అందుకోగా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గెర్హార్డ్ జీలర్‌ డైరెక్టరేట్ అవార్డు సొంతం చేసుకున్నారు.