కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించడంపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కడప జడ్పీ పీఠాన్ని టీడీపీకి ఖరారు చేయడంతో కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైన ఆదినారాయణరెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను కూటమి కోసం ఎంతో నిబద్ధతతో పనిచేశానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జమ్మలమడుగు పరిధిలో 46 స్థానాలకు గాను 46 స్థానాల్లోనూ విజయం సాధించామని గుర్తుచేశారు. అయితే రాత్రికి రాత్రే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే తనకు అర సెకన్ కూడా పట్టదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అధిష్ఠానంతో చర్చిస్తానని, తన తుది నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పదవిని తన సోదరుడి కుమారుడు డాక్టర్ చాదిపిరాళ్ల రాజేశ్ రెడ్డికి కేటాయిస్తారని ఆదినారాయణరెడ్డి ఆశించారు. అయితే అనూహ్యంగా వేరొకరికి కేటాయించడంతో ఈ వివాదం మొదలైంది. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో ఆదినారాయణరెడ్డి స్వయంగా మాట్లాడారు. తన నిర్ణయం మార్చుకోనేది లేదని స్పష్టం చేశారు.