సిద్దిపేటలో నిర్వహించిన ఇందిరమ్మ జీవిత బీమా సభ అట్టర్ ప్లాప్ కావడంతో సీఎం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసలు సభకు వచ్చిన పథకం గురించి మాట్లాడకుండా తన ఎత్తు, కేటీఆర్ గడ్డం వంటి వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయడానికే రేవంత్ వచ్చారా? అని ప్రశ్నించారు. సొంత జిల్లాలో జనం రాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలించిన విషయాన్ని అక్కడి పోలీస్ కమిషనరే స్వయంగా చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే సభలో బూతులు, అబద్ధాలు వల్లెవేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నీటిని ఎత్తిపోసేందుకు పంపులు, మోటార్లు లేవంటూ సీఎం చెప్పడం పచ్చి మోసమని హరీశ్‌ ఆరోపించారు. అలాంటప్పుడు దేవాదుల దగ్గర మోటార్లను పూర్తిస్థాయిలో ఎందుకు నడపడం లేదని, శ్రీశైలం నుంచి కేటాయించిన నీటిని ఎందుకు తోడలేకపోతున్నారని నిలదీశారు. కృష్ణా నదిలో రాష్ట్రానికి రావాల్సిన 299 టీఎంసీలను సైతం ఉపయోగించుకోలేని అసమర్థ స్థితిలో ఈ పాలన ఉందని విమర్శించారు. ట్రిబ్యునల్ ముందు సమర్థంగా వాదనలు వినిపించడంలో సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని, సభలో మాట్లాడిన పచ్చి అబద్ధాలకు గానూ సీఎం ముక్కు నేలకు రాయాలని హరీశ్ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించే పనిలో పడి తెలంగాణ సాగునీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కృష్ణా జలాల దోపిడీకి కాంగ్రెస్ సర్కారే ప్రత్యక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు.