ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధినేత అఖిలేష్ యాదవ్ నిర్వహించిన రోడ్‌షోలో విషాదం చోటుచేసుకుంది. ఓ బుల్డోజర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో 12 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజకీయ సభల్లో భద్రతా వైఫల్యాలపై తీవ్ర చర్చకు దారితీయడంతో పాటు, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.

ఎస్‌పీ చేపట్టిన పీడీఏ రథయాత్రలో భాగంగా బుధవారం గోరఖ్‌పూర్‌లోని కూడఘాట్ ప్రాంతంలో అఖిలేష్ యాదవ్ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. చౌరీ చౌరా ప్రాంతానికి చెందిన ఆర్యవర్ధన్ సింగ్ (12) అనే బాలుడు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. ర్యాలీపై పూల రేకులు చల్లుతున్న ఓ బుల్డోజర్ అదుపుతప్పి వేగంగా వచ్చి ఆర్యవర్ధన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు రోడ్డు డివైడర్‌పై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. మృతుడి తండ్రి ఓంకార్ సింగ్ స్థానిక బీజేపీ నాయకుడు కావడం గమనార్హం. అఖిలేష్ కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాత బుల్డోజర్ అతివేగంగా వచ్చి తన కుమారుడిని ఢీకొట్టిందని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. బాలుడి మృతికి సమాజ్‌వారీ పార్టీ గూండాయిజమే కారణమని రాష్ట్ర బీజేపీ ఆరోపించింది. అయితే, ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ, బాలుడి మరణం గురించి తనకు సమాచారం లేదన్నారు. రోడ్‌షోకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. "బీజేపీ సభ్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు ఎవరినైనా తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న గోరఖ్‌పూర్ ఎమ్మెల్యే సర్వన్ నిషాద్, క్యాబినెట్ మంత్రి డాక్టర్ సంజయ్ నిషాద్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు బుల్డోజర్‌ను స్వాధీనం చేసుకుని, దాని యజమానిని గుర్తించే పనిలో పడ్డారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌లో ఈ ప్రమాదం జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.