దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి 40 శాతం మేర రవాణా రంగమే కారణమని, ఆ శాఖా మంత్రిగా దీనికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం ఢిల్లీలో జరిగిన 14వ సీఐఐ బయోఎనర్జీ సదస్సులో గడ్కరీ ప్రసంగించారు. "దేశవ్యాప్తంగా అత్యాధునిక రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఫలితంగా వాహనాల సంఖ్య పెరిగి, వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. రవాణా శాఖ మంత్రిగా దేశంలో నెలకొన్న 40 శాతం వాయు కాలుష్యానికి నేనే బాధ్యత వహిస్తున్నాను" అని ఆయన వ్యాఖ్యానించారు. తన పదవీ కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 14 లక్షల కోట్ల నుంచి రూ. 22 లక్షల కోట్లకు చేరిందని, జపాన్‌ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

భారత్ తన ఇంధన అవసరాల కోసం 87 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతోందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉందని గడ్కరీ తెలిపారు. దిగుమతులను తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఇథనాల్, బయోగ్యాస్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై పెట్టుబడులు పెంచడం అనివార్యమని పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం 1.50 లక్షల ఎలక్ట్రిక్ బస్సుల అవసరం ఉంటే.. ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,000 మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు.

ఢిల్లీ వంటి మహానగరాల్లో కాలుష్య నివారణకు జీవ ఇంధనాలపై నిరంతరం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయకుండా వాటిని బయోఎనర్జీగా మార్చడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. గోబర్‌ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా సుమారు 3,000 బయోఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దిగుమతుల తగ్గింపు, వ్యయ నియంత్రణ, కాలుష్య రహిత ఇంధనం, స్వదేశీ ఉత్పత్తి అనే నాలుగు సూత్రాల ఆధారంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన విధానాన్ని రూపొందించిందని గడ్కరీ స్పష్టం చేశారు.