భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రితో వస్తున్న పోలికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరొకరి నీడలా ఉండటానికి రాలేదని, క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించడానికే వచ్చానని స్పష్టం చేశాడు. అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నీలో భారత జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ఆర్యవీర్, తండ్రితో పోల్చడంపై తొలిసారి మనసు విప్పి మాట్లాడాడు.

‘‘కెరీర్ ప్రారంభంలోనే నా తండ్రితో పోలికలు తప్పవనే నిజాన్ని గ్రహించాను. దాన్ని నేను ఆపలేను. మా ఇద్దరి ఆటలో ఎవరైనా పోలికలు చూస్తున్నారంటే అది వారి అభిప్రాయం. మా నాన్నపై వారికి ఉన్న ప్రేమ మాత్రమే. కానీ నేను ఇక్కడికి 'సెహ్వాగ్ 2.0' కావడానికి రాలేదు. ఆర్యవీర్ సెహ్వాగ్‌గా నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి వచ్చాను. రెండో సెహ్వాగ్‌గా నిలవడం కంటే మొదటి ఆర్యవీర్‌గా ఉండటానికే ఇష్టపడతాను’’ అని జియోస్టార్‌తో మాట్లాడుతూ ఆర్యవీర్ స్పష్టం చేశాడు.

ఈ టోర్నమెంట్‌లో ఆర్యవీర్ అద్భుతమైన ఫామ్‌తో చెలరేగాడు. మొత్తం 5 మ్యాచుల్లో 90.25 సగటు, 95కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 361 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర గాయంతోనూ అద్భుత పోరాటపటిమ ప్రదర్శించాడు. 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మోచేతికి బలమైన దెబ్బ తగిలి విపరీతమైన నొప్పి వేధిస్తున్నప్పటికీ, పెయిన్‌కిల్లర్స్ వేసుకుని 61 బంతుల్లో 58 విలువైన పరుగులు సాధించాడు. భారత్ ఒక వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.