ఏపీలో ఖనిజ సంపద సద్వినియోగం, ఆదాయార్జనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో అరుదైన ఖనిజాల అన్వేషణ, విలువ జోడింపు కోసం ప్రత్యేకంగా 'ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (ఏపీఆర్ఈడీసీ) ఏర్పాటుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. 

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేందుకు ఉద్దేశించిన ఐపీవో ప్రతిపాదనలకు కూడా అంగీకారం తెలిపారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గనుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఎన్‌ఎండీసీ తరహాలో ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందుకోసం అవసరమైతే ప్రైవేట్ ఏజెన్సీల సహాయం కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువ ఆధారంగా ఐపీవోకు వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్దేశించారు. 

రాష్ట్రంలోని ఖనిజ వనరులను కేవలం ఆదాయ వనరుగా కాకుండా భవిష్యత్ తరాలకు ఆస్తిగా చూడాలని, వాటి విలువ పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. మన వనరులను మన రాష్ట్రంలోనే వినియోగంలోకి తెచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేసేందుకు ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మూడు బ్లాకుల్లో కలిపి సుమారు 1,774.6 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. 

మరోవైపు, రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 6,500 క్వారీ లీజు దరఖాస్తులు, 223 రెన్యువల్స్‌ను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని సమావేశంలో చర్చించారు.

వచ్చే ఐదేళ్లలో ఖనిజ అన్వేషణ, వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్‌ కుమార్ మీనా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.