టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తుది జట్టు నుంచి తప్పించడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. సిరాజ్ పేరు కారణంగానే అతడిని జట్టులోకి తీసుకోలేదని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఆరోపించగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దీంతో క్రికెట్ జట్టు ఎంపిక విషయంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

వెల్లింగ్‌టన్‌ వేదికగా నిన్న‌ ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో నలుగురు పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అన్షుల్ కంబోజ్‌లతో భారత్ బరిలోకి దిగింది. అనుభవజ్ఞుడైన సిరాజ్‌ను కాదని కొత్తవారికి అవకాశం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై 'ఏఎన్‌ఐ' వార్తా సంస్థతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్.. "సిరాజ్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, అతడిని జట్టులోకి తీసుకోలేదు. అతని పేరు 'సిరాజ్' కావడం వల్లే ఈ అన్యాయం జరిగింది. ఇది స్పష్టమైన వివక్ష" అని సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ క్రికెట్ ఎంపికల్లోకి ఓటు బ్యాంకు, మత రాజకీయాలను చొప్పిస్తోందని ఆయన మండిపడ్డారు. తన 'ఎక్స్' ఖాతాలో స్పందిస్తూ.. "ఈ మ్యాచ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా పక్కనపెట్టారు. భారత జెర్సీ ధరించిన ప్రతి ఆటగాడు దేశం కోసమే ఆడతాడు" అని బదులిచ్చారు.

మరోవైపు, ఈ జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరాజ్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచిందని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించగా, అక్కడి పరిస్థితులు, గత రికార్డుల దృష్ట్యా సిరాజ్‌ను ఎందుకు పక్కనపెట్టారని రవిశాస్త్రి ప్రశ్నించారు.

అయితే, జట్టు యాజమాన్యం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. పేసర్ల ఎంపికపై వారం రోజులుగా చర్చించామని, ఫామ్‌లో ఉన్న బౌలర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వివరించాడు. కేవలం మొదటి రోజును దృష్టిలో పెట్టుకుని కాకుండా, పూర్తి మ్యాచ్‌కు అవసరమైన అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని, సిరాజ్‌తో ఎలాంటి సమస్య లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశారు.