బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న తగ్గుదల ఇవాళ‌ కూడా నమోదైంది. ఇటీవలి కాలంలో రికార్డు స్థాయికి చేరిన ధరలు క్రమంగా దిగి వస్తుండటంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాల ప్రభావంతోనే ధరలు తగ్గుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

నేటి మార్కెట్‌లో ధరలు ఇలా..
నేటి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 10 తగ్గడంతో దాని ధర రూ. 1,30,680కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా రూ. 10 తగ్గి, రూ. 1,19,790 వద్ద స్థిరపడింది. ఇక వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 తగ్గడంతో, దాని ధర రూ. 1,79,900గా నమోదైంది. గత 15 రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,30,680గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,19,790గా ఉంది. ఈ రెండు నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,79,900 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ఇతర ముఖ్య నగరాలైన ముంబై, చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. అయితే, ఢిల్లీలో మాత్రం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,30,830గా, 22 క్యారెట్ల ధర రూ. 1,19,940గా ఉంది.

స్థానిక పన్నులు, డిమాండ్, రవాణా ఛార్జీల వంటి కారణాల వల్ల నగరాల మధ్య బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని కొనుగోలుదారులు గమనించాలి.