గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ ఛైర్మన్ శామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడతారని తాను భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను పిట్రోడా బహిరంగంగా తోసిపుచ్చడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎన్డీటీవీ కథనం ప్రకారం.. ఓ ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా ఈ అంశంపై మాట్లాడారు. "భారత ప్రధాని నా ఫోన్‌ను ట్యాప్ చేస్తారని నేను నమ్మడం లేదు. దేశంలో దృష్టి సారించాల్సిన పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రధాని ఇలాంటి పనులు చేస్తారని నేను అనుకోను. నా ఫోన్ ట్యాప్ అవుతోందని నమ్మడానికి నాకైతే ఎలాంటి కారణం కనిపించడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు" అని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని రాహుల్ గాంధీ నిన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖాముఖి చర్చకు వస్తే అసలైన నిజాలు బయటపడతాయని చెప్పారు. విదేశీ శక్తులకు ఎవరు లొంగిపోయారో ప్రజలకు తెలుస్తుందని అన్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై పిట్రోడా మాట్లాడుతూ.. "మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉంది. మేం మంచి స్నేహితులం, కలిసి పనిచేశాం. అయితే కొన్ని అంశాల్లో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం" అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతే రాహుల్ వ్యాఖ్యలను బహిరంగంగా విభేదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.