వాహనం వేగం గంటకు కేవలం ఒక్క కిలోమీటర్‌ పెరిగినా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కింద పరిగణిస్తారా? ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ వాహనదారుడికి ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్‌ లిమిట్‌ ఉన్న రహదారిపై 101 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడంటూ అతడికి రూ.2,000 జరిమానా విధించారు.

అనుజీత్‌ శివమ్‌ అనే వ్యక్తి ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. తన కారు వేగాన్ని స్పీడ్‌ కెమెరా గంటకు 101 కిలోమీటర్లుగా గుర్తించిందని, దీంతో ఈ-చలాన్‌ జారీ అయిందని తెలిపారు. అయితే చలాన్‌లో నమోదైన మరో వివరంతో ఆయన ఆశ్చర్యపోయారు. వాహనం లొకేషన్‌ను 0°N, 0°Eగా చూపించిందని పేర్కొన్నారు. ఈ కోఆర్డినేట్స్‌ అట్లాంటిక్‌ మహాసముద్రం మధ్యలోని ప్రాంతాన్ని సూచిస్తాయి. దీంతో నోయిడా, యూపీ ట్రాఫిక్‌ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ.. ఇదేనా మీ రోడ్డు భద్రతా విధానం అంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన నోయిడా ట్రాఫిక్‌ పోలీసులు ఈ-చలాన్‌ హెల్ప్‌లైన్‌ 7065060882కు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 100 కిలోమీటర్ల స్పీడ్‌ లిమిట్‌ గరిష్ఠ పరిమితి మాత్రమేనని, భద్రత దృష్ట్యా గంటకు 90-95 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం మంచిదని కొందరు చెబుతున్నారు. ఏఐ ఆధారిత కెమెరాలు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా చలాన్లు జారీ చేస్తున్నందున, సాంకేతిక లోపాలకు ఆస్కారం ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు స్పీడ్‌ లిమిట్‌ ఐదు శాతం వరకు వెసులుబాటు ఉంటుందన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. అలాంటప్పుడు 101 కిలోమీటర్ల వేగానికి జరిమానా విధించడం సమంజసమేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వెసులుబాటు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ చలాన్‌కు వర్తిస్తుందా లేదా అన్నది అధికారిక నిబంధనల ఆధారంగా తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై స్పీడ్‌ లిమిట్‌ను గంటకు 120 కిలోమీటర్లకు పెంచాలని కూడా కొందరు కోరుతున్నారు.