అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టు, భారత యువ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఒమన్‌లో జరుగుతున్న ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో కప్ గెలవాలంటే భారత్ 338 పరుగులు చేయాలి.

పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (107) అద్భుత సెంచరీతో జట్టుకు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా అబ్దుల్ ఖాదిర్ (54 బంతుల్లో 80), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (60 బంతుల్లో 63) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఒక దశలో పాక్ స్కోరు 350 దాటేలా కనిపించింది. 

అయితే, చివరి ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకున్నారు. ముఖ్యంగా ఆఖరి ఆరు ఓవర్లలో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్‌ను కట్టడి చేశారు. భారత బౌలర్లలో కవ్య పటేల్ నాలుగు వికెట్లు తీయగా, సి. వెంకట మూడు వికెట్లతో రాణించాడు.

గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలంటే భారత బ్యాటర్లు అసాధారణ పోరాట పటిమ కనబరచాల్సి ఉంటుంది.