కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ విడుదలైన నేపథ్యంలో... మాజీ ప్రధాని దివంగత పి.వి. నరసింహారావు కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమైంది. పీవీపై సోనియాకు గౌరవమే ఉంటే ఆయన అంత్యక్రియలను దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సూటిగా ప్రశ్నించారు.

"సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ నేను ఇంకా చదవలేదు. కానీ తనకు పీవీతో ఎలాంటి విభేదాలు లేవని, ఆయనంటే ఎంతో గౌరవమని, తన అత్త, మాజీ ప్రధాని ఇందిర, భర్త రాజీవ్‌గాంధీకి అత్యంత ఆప్తుడని సోనియా ఆ పుస్తకంలో నిక్షిప్తం చేసినట్టు మీడియా ద్వారా విన్నాను. కానీ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవచేసిన, దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ అంత్యక్రియలను ఢిల్లీలో జరపలేదెందుకు? స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధానికీ ఇలా జరగలేదు. దీనిని గౌరవంగా భావించాలా? అవమానమని అనుకోవాలా?" అంటూ ఆమె నిలదీశారు.

మరోవైపు పీవీ మనవడు, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ సైతం సోనియా పుస్తకంపై తీవ్రంగా స్పందించారు. ఈ ఆత్మకథ అసత్యాల పుట్ట అని, చారిత్రక తప్పిదాలతో కూడి ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి పీవీ నరసింహారావు అందించిన సేవలను పుస్తకంలో ఉద్దేశపూర్వకంగానే దాటవేశారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులను మాత్రమే పైకి తెస్తూ, పార్టీలోని ఇతర ముఖ్య నేతలను కించపరచడం గాంధీ కుటుంబానికి అలవాటేనని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాలతో పీవీ పట్ల కాంగ్రెస్ వైఖరిపై రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది.